బంగారు బతుకమ్మ శుభాకాంక్షలు
క్రియేటర్స్ స్వచ్చంద సంస్థ
క్రియేటర్స్ స్వచ్చంద సంస్థ
ఈ ప్రపంచ చరిత్రలో బతుకమ్మ అంతటి గొప్ప పండగ మరోచోట లేదంటే అతిశయోక్తి కాదు. మహిళలు ఎంతో ప్రేమించే పండగ ఇది. పూలను పూజించడం, తమ మనోభావాలను పాటల రూపంలో వెల్లడించడం, తమ అభీష్టాలను నెరవేర్చుకోవడం ఈ పండగ సందర్భంగానే. అందుకే ప్రతి ఇంటి పూలు పలకరిస్తాయి. ప్రతీ నోటా పాట పల్లవిస్తుంది. ప్రతి వ్యక్తీ తమకు నచ్చిన ఆభరణాలు, కొత్త దుస్తులతో ముస్తాబవుతారు.
ఆశ్వీయుజ మాసంలో వచ్చే విజయదశమి పండగకు తొమ్మిది రోజులు ముందు నుంచే దేవీ నవరాత్రులు, బతుకమ్మ పండగ ప్రారంభమవుతాయి. ప్రతి ఏడాది మహాలయ అమావాస్య (పితృ అమావాస్య) రోజు నుండి బతుకమ్మలను పేరుస్తారు.
బతుకమ్మ పేర ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు మంగళగౌరిని పూజిస్తారు. ఈ పండగకు ముందు తొమ్మిది రోజులు బొడ్డెమ్మ పండగ చేస్తారు. ఇది మహాలయ అమావాస్యతో పూర్తవుతుంది. ఈ వేడుక వర్షరుతువు సమాప్తిని, శరధృతువు ఆగమనాన్ని సూచిస్తుంది. ఈ తొమ్మిది రోజులూ తొమ్మిది రకాల సద్దులు. అంటే చక్కెర కలిపిన వేర్వేరు ధాన్యపు పిండులు కలిపి గౌరీదేవికి నైవేద్యంగా సమర్పిస్తారు. కాబట్టే, దీన్ని సద్దుల బతుకమ్మ అని అంటారు.

0 comments:
Post a Comment